మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

  • భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు
  • ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
  • మా అంతర్గత విషయాల్లో మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదన్న భారత్
  • పాకిస్థాన్ మొదట తమ దేశంలోని మైనారిటీల హక్కులను చూసుకోవాలని హితవు
  • కాశీలోని ఓ మసీదుకు రైల్వే నోటీసుల నేపథ్యంలో జర్దారీ  వ్యాఖ్యలు 
భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు జర్దారీకి లేదని స్పష్టం చేసింది. ఆయన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, అనవసరమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు.

వారణాసిలోని కాశీ రైల్వే స్టేషన్ సమీపంలో గల గంజ్ షహీదా మసీదుకు భారత రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులను ఉద్దేశించి జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గురువారం రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పాక్ అధ్యక్షుడి ప్రకటనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోందని, భారత అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత ఆయనకు ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు.

పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కుల ఉల్లంఘన, అక్కడి మానవ హక్కుల దయనీయ స్థితిపై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను జైస్వాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇతరులకు హితవు పలికే ముందు పాక్ తన దేశంలోని పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. ద్వేషం, మతతత్వాన్ని ప్రోత్సహించడమే పాకిస్థాన్ జాతీయ విధానంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

భారత్ తన అంతర్గత విధానాలకు సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ వంటి విషయాల్లో విదేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చాలాకాలంగా స్పష్టం చేస్తూ వస్తున్న విషయం విదితమే.                                

India
Pakistan
Asif Ali Zardari
Randhir Jaiswal
Varanasi Mosque
Ministry of External Affairs

More Telugu News